
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు కానున్నాయి. వీటి ఏర్పాటుకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రెవెన్యూ ట్రిబ్యునల్ అధ్యక్షులుగా ఆయా జిల్లా కలెక్టర్లు ఉండనున్నారు. రెవెన్యూ ట్రిబ్యునళ్లు జిల్లా కేంద్రంలోనే కాకుండా, అవసరమైతే మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ భూహక్కుల పట్టాదారు పాసు పుస్తకం చట్టం-2020లోని సెక్షన్-13లోని అధికారాలన్నీ ఈ రెవెన్యూ ట్రిబ్యునల్స్ కు వర్తిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16, 000 రెవెన్యూ కేసులు పెండింగ్లో ఉన్నాయని అధికారుల అంచనా. రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటుతో ఆ వివాదాలన్నీ పరిష్కారం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
గత సంవత్సరం సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ కోర్టులను రద్దుచేసిన సంగతి తెలిసిందే. భూవివాదాల పరిష్కారానికి తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020 తెచ్చింది కానీ దాంతో కూడా సమస్యలు తీరకపోవడంతో మళ్ళీ రెవెన్యూ ట్రిబ్యూనల్స్ ఏర్పాటు చేస్తోంది.