
జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదల గుర్తించి వారికి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు. అలాగే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంచాలని సూచించారు. రాష్ట్రంలో పలుచోట్ల ఉన్న విద్యాలయాలకు సొంత భవనాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారని కనుక వెంటనే కొత్త భవనాలు నిర్మించాలని అని సిఎంను కోరారు. కోర్టు కేసుల్లో ఇరుకొన్న ప్రభుత్వ భూములను వీలైనంత త్వరగా పరిష్కరించి వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలని ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేసారు.
తెలంగాణ ఏర్పడక మునుపు కూడా సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి ఇచ్చింది. ఇతర రాష్ట్రాలలో కూడా కాస్త టూ ఇటూగా వేర్వేరు పేర్లతో ఈ ఇళ్ళ నిర్మాణ పధకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలనే లక్ష్యంతో సిఎం కేసీఆర్ సకల సౌకర్యాలతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టించి ఇస్తున్నారు. కానీ రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుపేదలందరికీ ఇళ్ళు కట్టించి ఇవ్వడం చాలా కష్టమని, అదృష్టం కలిసివస్తేనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు పొందగలుగుతారని సాక్షాత్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కనుక నేటికీ రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుపేదల సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయింది. కనుక ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ వ్రాసినంత మాత్రన్న ప్రభుత్వం అదనంగా ఇళ్ళు నిర్మించి ఇచ్చేయలేదు కానీ రాష్ట్రంలో సొంతభవనాలు లేక ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్దులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు కనుక ఆ సూచనను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని వారి సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుంది.