మైహోం అక్రమ మైనింగ్‌పై ధర్మపురి సీఎస్‌కు ఫిర్యాదు

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ శుక్రవారం బీఆర్‌కె భవన్‌కు వెళ్ళి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ను కలిసి మైహోం కంపెనీ అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నల్గొండ రిజర్వ్ ఫారెస్టులో మైహోం కంపెనీ అక్రమంగా 600 ఎకరాలలో మైనింగ్ చేస్తోందని తాను ప్రభుత్వానికి తెలియజేసినా స్పందించలేదన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో కూడా మైహోం కంపెనీ మైనింగ్‌కు సిద్దపడగా గతవారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. దానిలో ప్రజలతోపాటు తాను కూడా పాల్గొని వ్యతిరేకించామని చెప్పారు. మైహోం అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం స్పందించడం లేదు కనుకనే సోమేష్ కుమార్‌ను నేరుగా కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అక్రమ మైనింగ్‌ చేస్తున్న మైహోం కంపెనీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అర్వింద్ కుమార్ కోరారు. జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాలలో కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పైసస్ బోర్డ్ రీజినల్ ఆఫీస్ కమ్ ఎక్స్‌టెన్షన్ సెంటర్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని సోమేష్ కుమార్‌ను కోరానని తెలిపారు. కేంద్రప్రభుత్వం ఈ రెండు జిల్లాలోని పసుపు రైతులకు అన్ని విధాలా సహాయపడేందుకు ముందుకు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు.