ఐటీఐఆర్‌కు నిధులు కేటాయించవలె: కేటీఆర్‌

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి మరో లేఖ రాశారు. కేటీఆర్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం 2010 సంవత్సరంలో హైదరాబాద్‌ను ఐటీఐఆర్‌ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్)గా ఎంపిక చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఐటీఐఆర్ కోసం హైదరాబాద్ చుట్టుపక్కల మూడు క్లస్టర్లలో 49,000 ఎకరాలను సేకరించి అందుబాటులో ఉంచిందని అన్నారు. ఐటీఐఆర్‌ ఏర్పాటు చేస్తే హైదరాబాద్‌కు మరిన్ని కొత్త ఐటీ కంపెనీలు వాస్తాయని కేంద్రమే సూచించిందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. కనుక రాబోయే 20 ఏళ్లలో హైదరాబాద్‌ నగరంలో చేపట్టబోయే వివిద ప్రాజెక్టులకు సంబందించి కార్యాచరణను కూడా రూపొందించామని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే దేశవిదేశాలకు చెందిన ప్రముఖ ఐ‌టి కంపెనీలు హైదరాబాద్‌కు తరలివచ్చాయని, ఐటీఐఆర్ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం ఉందని ఈ లేఖలో ప్రస్తావించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు మూడు వేల కోట్లు ఖర్చవుతుందని కనుక రాబోవు కేంద్ర బడ్జెట్‌లో ఐటీఐఆర్‌ ఏర్పాటుకు అవసరమైన నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.