బండి సంజయ్‌కి టిఆర్ఎస్‌ ప్రతి సవాల్

ఖమ్మం, వరంగల్‌ మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బిజెపి నేతలు అక్కడ వాలిపోయి టిఆర్ఎస్‌తో మాటల యుద్ధాలు ప్రారంభించారు. నిన్న వరంగల్‌లో పర్యటించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, “రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పధకాలకు కేంద్రం కూడా భారీగా నిధులు ఇస్తున్నప్పటికీ వాటిని టిఆర్ఎస్‌ ప్రభుత్వం తనవిగా చెప్పుకొంటోంది. ఆ నిధులను కూడా దారి మళ్ళించి దుర్వినియోగం చేస్తోంది. దీనిపై నేను వరంగల్‌ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్దంగా ఉన్నాను. మరి సిఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావు సిద్దంగా ఉన్నారా?” అని సవాలు విసిరారు.    

బండి సంజయ్‌ చేసిన ఆరోపణలపై వరంగల్‌ తూర్పు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఘాటుగా బదులిచ్చారు. “రాష్ట్రం నుంచి ఏటా పన్నుల రూపంలో కేంద్రానికి వెళుతున్న సొమ్ములోనే కొంత తిరిగి ఇస్తూ రాష్ట్రాన్ని ఏదో ఉద్దరించినట్లు బండి సంజయ్‌ మాట్లాడుతున్నారు. ఆ నిధులలో న్యాయంగా రాష్ట్రానికి రావలసిన వాటాను కూడా  కేంద్రం చెల్లించడం లేదు. వాటి కోసం సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని కలిసి విజ్ఞప్తి చేసినా…కేంద్రానికి లేఖలు వ్రాసినా స్పందించడం లేదు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చిందో...ఎన్ని ఎగవేసిందో అన్నిటికీ మా దగ్గర లెక్కలున్నాయి. ఎన్నికలలో రాజకీయ లబ్ది పొందేందుకు బండి సంజయ్‌ పవిత్రమైన ఆలయాలను వాడుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇది చాలా దారుణం. ఆలయాల పవిత్రకు భంగం కలిగించే అటువంటి పనులు మేము ఎన్నడూ చేయబోము. బండి సంజయ్‌కు అంతగా ముచ్చటగా ఉంటే తన తల్లిపై ప్రమాణం చేస్తే బాగుంటుంది,” అని నన్నపనేని నరేందర్ అన్నారు.