జస్టిస్ హిమాకోహ్లీకి ఢిల్లీ హైకోర్టు ఘనంగా వీడ్కోలు

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హిమా కోహ్లీ నియమితులైన సంగతి తెలిసిందే. తెలంగాణ సీజేగా పదోన్నతిపై బదిలీ అవుతున్న సందర్భంగా ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తులతో కూడిన ఫుల్ కోర్టు ఆమెకు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా  హిమా కోహ్లీ మాట్లాడుతూ, "దేశవిభజన సమయంలో నేను మా కుటుంబంతో కలిసి పాకిస్తాన్ నుండి భారత్‌కు తరలివచ్చాను. నా ప్రాథమిక, ఉన్నతవిద్య అంతా ఢిల్లీలోనే సాగింది. చదువుకునే రోజుల్లో సిటీ బస్సులలోనే వెళ్ళివస్తుండేదాన్ని. ఎప్పటికైనా నేను సివిల్ సర్వెంట్ కావాలని మా నాన్నగారి కోరిక. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేందుకు లైబ్రరీ కార్డు వస్తుందనే ఉద్దేశంతోనే నేను ఎల్‌ఎల్‌బి అడ్మిషన్ తీసుకున్నాను కానీ చివరికి సివిల్స్ కు బదులు న్యాయవాద వృత్తిలోనే స్థిరపడ్డాను. మా అమ్మ సహకారంతో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాను. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నాకంటూ సొంతంగా ఆఫీస్ కూడా ఉండేది కాదు. దాంతో పాత కారునే కార్యాలయంగా వినియోగించుకున్నాను. ఆ సమయంలో కోర్టుఫీజు ఎంత కట్టాలో కూడా తెలియదు. అటువంటి పరిస్థితులలో సీనియర్ న్యాయవాదులు సలహాలు, సూచనలు తీసుకుంటూ మెల్లగా పని నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు అడ్వకేట్ కమిషన్ ఓ రిపోర్టును తయారు చేయమన్నారు. సీనియర్ న్యాయవాదుల సలహాలు సూచనలు తీసుకొని దాన్ని తయారు చేశాను. ఆ విధంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు ఈస్థాయికి ఎదిగాను. కష్టపడితే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనని తెలుసుకొనేందుకు నా జీవితమే ఓ నిదర్శనం,” అని హిమా కోహ్లీ అన్నారు.

 ఆమెతో చిరకాలం కలిసి పనిచేసిన న్యాయమూర్తులు కూడా వీడ్కోలు సమావేశంలో ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.