తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆదివారం ఉదయం నుంచి 48 గంటల దీక్షకు దిగారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు, ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని దీక్ష చేపట్టారు. కోదండరాం మొదట ఇందిరా పార్కు వద్ద దీక్ష చేయాలనుకున్నా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైదరాబాద్‌లోని తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలోనే దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఆరు సంవత్సరాలైనా నిరుద్యోగ భృతి, ప్రభుత్వ నియామకాలు, కొత్త వారికి పెన్షన్ విధానం వంటి అంశాలను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. అలాగే సీఎం ఒకసారి నియంత్రిత సాగు... మరొకసారి నియంత్రిత సాగు రద్దు...అంటున్నారన్నారు. దీనితో రైతులలో అయోమయం నెలకొందన్నారు. కోదండరాం ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ తమ పోరాటం ఆగదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ జనసమితి కార్యకర్తలు ఒకవేళ పోలీసులు అరెస్టు చేస్తే అక్కడికక్కడే దీక్షకు దిగాలని కోదండరాం పిలుపునిచ్చారు. కోదండరాం చేపట్టిన దీక్షకు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, సిపిఎం, సిపిఐ, టి టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ తదితరులు మద్దతు తెలిపారు.