కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో ప్రతీ ఒక్కరికీ కరోనా టీకాలను ఉచితంగానే ఇస్తాం. డ్రై రన్ ప్రక్రియ పూర్తికాగానే టీకాలు వేసే ప్రక్రియను ప్రారంభిస్తాము,” అని చెప్పారు.
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఈ నెలాఖరులోగా 10 లక్షల కొవీషీల్డ్ డోసులు వచ్చే అవకాశం ఉంది. కనుక రాబోయే నెలరోజులలో కేంద్రప్రభుత్వం సూచించిన విధంగా ప్రాధాన్యతా క్రమంలో మొదటివిడతలో రాష్ట్రంలోని మూడు లక్షల మంది వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు రెండేసి డోసుల చొప్పున ఇస్తాము. మొదటివిడతలోనే మరో రెండు లక్షలమంది పోలీసులు, పారిశుధ్య కార్మికులు కూడా టీకాలు వేయిస్తాము. మళ్ళీ రెండో విడతలో వ్యాక్సిన్లు వచ్చిన తరువాత కేంద్రప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం టీకాలు వేస్తాము,” అని చెప్పారు.
నిన్న ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ, దేశీయంగా తయారైన టీకాలనే వినియోగిస్తామని చెప్పారు. కనుక పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కొవీషీల్డ్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాక్సిన్ టీకాలను వినియోగించడం ఖరారు అయినట్లే. వాటి ఉత్పత్తి, లభ్యత, ప్రాధాన్యత క్రమాలను బట్టి దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. బహుశః ఈ ప్రక్రియ ఈ ఏడాది పొడవునా సాగే అవకాశం ఉంది.