మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నరసయ్య మృతి

ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నరసయ్య (87) అనారోగ్యంతో కన్నుమూశారు. మధిర నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కట్టా వెంకట నరసయ్య సిపిఎం పార్టీలో కీలకనేతగా పేరొందారు. ఆ తర్వాత సిపిఎం పార్టీ విధానాలు నచ్చకపోవడంతో తన పదవీకాలానికి రెండు నెలల ముందుగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

కట్టా వెంకట నరసయ్య గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కల్లూరు మండలం, పోచారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సిపిఎం నేతలు, ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నేతలు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంకట నరసయ్య నిరంతరం అందుబాటులో ఉండేవారని అన్నారు.