
తెరాస కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తెరాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్రంగా ఖండించారు. నిన్న ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ బిజెపిలో చేరేటందుకు తెరాస ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరన్నారు. తెరాస నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా బిజెపిలో చేరరని…ఎమ్మెల్యేలు అందరూ సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సారధ్యంలోనే పని చేస్తామన్నారు. తెరాస నిబద్ధత కలిగిన పార్టీగా ఆయన అభివర్ణించారు. జిహెచ్ఎంసిలో గెలిచిన బిజెపి కార్పొరేటర్లే టిఆర్ఎస్తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని గువ్వల బాలరాజు అన్నారు.
ఎమ్మెల్యే బాలరాజు బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తూనే అనాలోచితంగానో లేదా వ్యూహాత్మకంగానో ‘బిజెపి కార్పొరేటర్లే టిఆర్ఎస్తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని’ గువ్వల బాలరాజు చెప్పడం ద్వారా బండి సంజయ్ చేసిన ఆరోపణలను దృవీకరించినట్లయింది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలిచిన బిజెపి కార్పొరేటర్లను టిఆర్ఎస్లోకి ఆకర్షించి మేయర్ పదవి దక్కించుకొనేందుకు ఒక్కో కార్పొరేటర్‌కి రూ.5 కోట్లు చొప్పున డబ్బు ఆశజూపుతోందని బండి సంజయ్ ఆరోపించారు. ఆ ఆరోపణలను గువ్వల బాలరాజు ధృవీకరించినట్లైంది.