ఈసారి పీఆర్‌సీ 15 శాతం మాత్రమే?

విశ్రాంత ఐఏఎస్ అధికారి సిఆర్ బిశ్వాల్‌ ఛైర్మన్‌గా, విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఉమామహేశ్వరరావు, మహమ్మద్ అలీ రహేఫత్‌లు సభ్యులుగా ఏర్పాటైన సవరణ సంఘం నిన్న తమ తొలి నివేదికను బీఆర్‌కె భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కలిసి అందజేశారు. తెలంగాణ ఏర్పడి ఆరేళ్ళు పూర్తయినప్పటికీ ఇదే తొలి వేతన సవరణ నివేదిక కావడం విశేషం. 

సుమారు రెండున్నరేళ్ళ క్రితం ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వోద్యోగుల వేతన సవరణ(పీఆర్‌సీ) సంఘం కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2019లో ఒకసారి, ఏప్రిల్ 2020, నవంబరు 2020లో మరోసారి పొడిగించింది. కానీ ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేతన సవరణకు గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో దాదాపు రెండున్నర సంవత్సరాలుగా కాలక్షేపం చేసి ఇప్పుడు సిఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆ నివేదికను అందించింది. ఈ నివేదికలో ప్రభుత్వ ఉద్యోగులకు 15 శాతం ఫిట్మెంట్‌ను పెంచాలని సూచించినట్లు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ అధ్యక్షతన ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులు రజత్‌కుమార్, రామకృష్ణారావులతో కూడిన త్రిసభ్య కమిటీ వేతన సవరణ సంఘం సమర్పించిన నివేదికపై నేడు చర్చించనుంది. ఈ త్రిసభ్య కమిటీ శనివారం ఉద్యోగ సంఘాలతో సమావేశమై వేతన సవరణ గురించి చర్చించనుంది.