ఎన్నికల సంఘంపై బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో బిజెపి నేతలు ఇవాళ్ళ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను కలిశారు. జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు విడుదలై నెల రోజులు గడుస్తున్నా కార్పొరేటర్‌ల ఎన్నికను నిర్ధారిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేయలేదని ఫిర్యాదు చేశారు. కనుక తక్షణం గెలిచిన కార్పొరేటర్లను గుర్తిస్తూ గెజిట్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. 

అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్‌ నగరాన్ని వరదలు ముంచెత్తడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు కనుక ఈ సమయంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించవద్దని మేము పదేపదే ప్రభుత్వానికి చెప్పాము. ముందు వారికి సాయపడదామని తరువాత తాపీగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని చెప్పాము. కానీ ఆలస్యం చేస్తే బిజెపి ఎక్కడ బలపడుతుందో అనే భయంతో సిఎం కేసీఆర్‌ ఆదరబాదరాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. ప్రతిపక్షాలకు కనీసం అభ్యర్ధులను ఖరారు చేసుకోవడానికి తగినంత సమయం ఇవ్వకుండా హడావుడిగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. సిఎం కేసీఆర్‌, అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరూ కలిసి ప్రతిపక్షాలను దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతోనే ఆవిధంగా చేస్తుంటే రాజ్యాంగబద్దంగా పనిచేయవలసిన ఎన్నికల సంఘం వారు చెప్పినట్లే చేసుకుపోయింది. 

అప్పుడు హడావుడిగా ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల సంఘం ఫలితాలు వెలువడి నెలరోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎందుకు కార్పొరేటర్ల ప్రమాణస్వీకరానికి షెడ్యూల్ విడుదల చేయలేదు? మేయర్ ఎన్నికకు ఎందుకు తేదీ ప్రకటించలేదు?ఇంతవరకు జీహెచ్‌ఎంసీ పాలకవర్గాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? అంటే సిఎం కేసీఆర్‌, అసదుద్దీన్ ఓవైసీల కనుసన్నలలో పనిచేస్తున్నందునే అని చెప్పుకోవలసి ఉంటుంది. నెలరోజులైనా గెలిచిన కార్పొరేటర్ల చేత ప్రమాణస్వీకారం చేయించలేదు. ఇది మాకే కాదు టిఆర్ఎస్‌, మజ్లీస్‌ కార్పొరేటర్లందరికీ అవమానమే. అందుకే మేము మా కార్పొరేటర్ల చేత భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేయించవలసి వచ్చింది. కనీసం ఇప్పటికైనా ఎన్నికల సంఘం రాజ్యాంగబద్దంగా వ్యవహరించి తక్షణం గెలిచిన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారాలకు ఏర్పాటు చేసి మేయర్ ఎన్నిక ప్రక్రియను పూర్తిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.