తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

ఆనందంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్న వేళ ప్రజలకు, వేడుకలకు అనుమతించిన తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈరోజు అర్ధరాత్రి వరకు కొత్త సంవత్సరం వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. నేటికీ నగరంలో కరోనా కేసులు నమోదవుతుంటే ఇవాళ్ళ అర్ధరాత్రి వరకు వేడుకలు జరుపుకోవడానికి, మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు తెరిచి ఉంచడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వాజ్యాలపై హైకోర్టు గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కొత్తరకం స్టెయిన్ వైరస్‌పై హైకోర్టు ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సందించింది. ఇంకా పాత కరోనా తీవ్రత తగ్గక మునుపే రాష్ట్రంలోకి కొత్తరకం స్టెయిన్ వైరస్‌ ప్రవేశించిందని, దానిని అడ్డుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళిక ఉందో చెప్పాలని నిలదీసింధి. దీనిపై జనవరి 20లోగా పూర్తి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. చలికాలంలో స్ట్రైన్ వైరస్ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో వారి సూచనలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి నగరమంతటా ఆంక్షలు విధించాలని హైకోర్టు పోలీసుశాఖను ఆదేశించింది. కేవలం ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఫ్లై ఓవర్లను మూసివేస్తే సరిపోదని అర్ధరాత్రి 144 సెక్షన్‌ను విధించే అవకాశాలను పరిశీలించాలని పోలీస్ శాఖకు హైకోర్టు సూచించింది. ఇదివరకే ఢిల్లీ, బెంగళూరు, ముంబాయి నగరాలలో కొత్త సంవత్సర వేడుకలను నిషేధించారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసింది.