నిధుల కోసం మంత్రి కేటీఆర్‌ కేంద్రానికి లేఖలు

తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా కేటీఆర్  కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లకు మళ్ళీ లేఖలు రాశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా  రాష్ట్రంలో ఉన్న 30 పట్టణాలను ఎంపిక చేసి కనీస మౌలిక  సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. కనుక రాబోవు కేంద్ర బడ్జెట్‌లో పట్టణ అభివృద్ధికి 20 శాతం కేంద్రం నిధులు విడుదల  చేయాలన్నారు. హైదరాబాదులో నాలలు, మురికి కాల్వల ఆధునికీకరణకు నిధులు కేటాయించాలన్నారు. హైదరాబాద్లో నాలాలను ఆధునికీకరణ చేయకపోవడం వల్ల అక్టోబర్ నెలలో నగరాన్ని వరదలు ముంచెత్తాయన్నారు. నాలాల ఆధునికీకరణ కోసం రూ.1,200 కోట్లు కేటాయించాలన్నారు.

త్వరలోనే స్ట్రెజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమాన్ని  చేపట్టనున్నామని తెలిపారు. అలాగే వరంగల్లో జిల్లాలో కూడా మెట్రో రైలుకు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ తరువాత రెండో స్థానంలో ఉన్న వరంగల్‌ నగరంలో రాబోయే సంవత్సరాలలో జనాభా గణనీయంగా పెరుగుతుందని దానికనుగుణంగా మెట్రోరైలు, రోడ్ల విస్తరణ వంటి పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కనుక రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు లేఖల ద్వారా విజ్ఞప్తి చేసారు.