టిజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం నిరాహార దీక్ష

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం జనవరి 3,4 తేదీలలో ‘బతుకు తెరువు నిలబెట్టాలి... తెలంగాణను కాపాడాలి...’అనే నినాదంతో 48 గంటలపాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ, పంటల కొనుగోలు, ఎల్ఆర్ఎస్‌ తదితర అంశాలలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిరాహారదీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఈ నిరాహార దీక్షకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని ప్రొఫెసర్ కోదండరాం కోరారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలపై పోరాడేందుకు తెలంగాణ జనసమితి ఓ కార్యాచరణను రూపొందించిందని చెప్పారు.