టిఆర్ఎస్‌కు ప్రవీణ్ గౌడ్ గుడ్ బై

గత ఐదేళ్ళుగా పూలనావలా సాగిపోతున్న టిఆర్ఎస్‌...ప్రభుత్వానికి వరుసగా లోక్‌సభ, దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో ఎదురుదెబ్బలు తగలడంతో ప్రస్తుతం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఈ ఎన్నికల ప్రభావం పార్టీపై కూడా పడుతోంది. ఇప్పటివరకు ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్‌లో చేరేవారే తప్ప టిఆర్ఎస్‌ నుంచి ఇతర పార్టీలలోకి వెళ్ళినవారి సంఖ్య వేళ్ళమీదే లెక్కపెట్టవచ్చు. కానీ ఇప్పుడు టిఆర్ఎస్‌లో నుంచి ఇతర పార్టీలలోకి క్రమంగా ఫిరాయింపులు మొదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలోనే పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి టిఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరగా, ఆ తరువాత కొందరు ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు బిజెపిలో చేరారు. 

తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిబట్ల మున్సిపల్‌ చైర్మన్‌ ప్రవీణ్ గౌడ్ టిఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇవాళ్ళ తన రాజీనామా లేఖను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు పంపించి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ప్రవీణ్ గౌడ్ గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన టిఆర్ఎస్‌లో చేరారు. మళ్ళీ ఇప్పుడు సొంతగూటికి చేరుకున్నారు.