
సీఎం కేసీఆర్ నియంత్రితసాగు విధానం రద్దు చేయడం పట్ల రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతించారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నియంత్రిత సాగు విధానం వల్ల నష్టపోయిన రైతులకు ఎలాంటి సహాయం చేస్తారని.... దాంతో వారికి కలిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. సిఎం కేసీఆర్ ఆ విధానాన్ని తెచ్చినప్పటినుండి భాజపా దానిని వ్యతిరేకిస్తూ పోరాడుతూనే ఉందన్నారు. కానీ సిఎం కేసీఆర్ మా పోరాటాలను వారు అపహాస్యం చేశారన్నారు. ఇప్పటికైనా నియంత్రితసాగు విధానం రద్దు చేసినందుకు చాలా సంతోషిస్తున్నామన్నారు. కేంద్రప్రభుత్వం సూచిస్తున్నట్లుగా రాష్ట్రంలో కూడా వ్యవసాయ యాంత్రీకరణ, పంటలకు ప్రధానమంత్రి ఫసల్ యోజన వంటి పథకాలను తొందరగా అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డ్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి రైతుకు మద్దతు ధర ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించాలని అన్నారు. కేంద్రప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే భావిస్తోంది తప్ప కీడు చేసేందుకు చట్టాలను తీసుకురాలేదన్నారు. రైతుల శ్రేయస్సు తమ పార్టీకి, కేంద్రప్రభుత్వానికి ప్రధానమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు దేశంలో ఎక్కడైనా తమ పంటలను అమ్ముకోవచ్చని బండి సంజయ్ అన్నారు.