కొండా సురేఖ, సీతక్కలకు కీలక పదవులు?

పిసిసి అధ్యక్ష పదవిపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మద్య జరుగుతున్న పంచాయితీ ఇంకా తేలకమునుపే, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఈసారి పార్టీలో మహిళా నేతలకు కీలక పదవులు కట్టబెట్టాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నట్లు తాజా సమాచారం. ఆ జాబితాలో కొండా సురేఖ, ఎమ్మెల్యే సీతక్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి భార్య పద్మావతి తదితరుల పేర్లున్నట్లు తెలుస్తోంది. డికె.అరుణ, విజయశాంతివంటి ముఖ్యమైన మహిళా నేతలు కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరడంతో వారికి ధీటుగా పార్టీలోని మహిళా నేతలను ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకం జరుగగానే, రాష్ట్ర కాంగ్రెస్‌ను సమూలంగా ప్రక్షాళన చేసి కొండా సురేఖకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి, సీతక్క రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి, పద్మావతి, ఇందిరా శోభన్, నేరెళ్ళ శారద, ఉజ్మా షకీర్, సునీతా రావు, కాల్వ సుజాత వంటి మహిళా నేతలకు పిసిసిలో కీలక పదవులు, బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.