
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి, ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం నాడు అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధి, వచ్చే ఏడాది జరగబోయే జాతరపై ఆలయ సిబ్బంది, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ మేయర్ గుండా ప్రకాష్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర వచ్చే సంవత్సరం జనవరి 13, 14, 15 తేదీలలో జరగనుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను అనుసరించి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. జాతరలో పాల్గొనే భక్తులందరికీ మాస్కూలు ధరించడం తప్పనిసరి చేయాలని సూచించారు. కోవిడ్ నేపథ్యంలో జాతర జరిగే ప్రాంతమంతటా నిరంతరం హైపోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయాలన్నారు.
దూరప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకొని జాతరలో పాల్గొనేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు కనుక వారి సౌకర్యార్ధం ఎక్కడికక్కడ శాశ్వత ప్రాతిపదికన స్నానపు గదులను, మంచినీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటుచేయాలన్నారు. నిరంతరం శానిటేషన్ చేయించాలని, భక్తులకు మంచినీటి సరఫరా అందుబాటులో ఉండాలన్నారు. అలాగే నిరంతరం అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ ఇంజన్, విద్యుత్, వైద్యసదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.