
తెలంగాణకు తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్)ను సిద్ధం చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సార్ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీకి అప్పగించింది. ఆ సంస్థ ఈ ప్రాజెక్టుకు సంబందించిన తుదినివేదికను ఇటీవల ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం.
ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్లో దీనిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారు 680.44 ఎకరాలలో చేపట్టే ఈ పనులను మొత్తం తొమ్మిది ప్యాకేజీలుగా విభజించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.600 కోట్లుగా ఉంటుందని డీపీఆర్‌లో పేర్కొన్నట్లు సమాచారం. దీనిలో రెండు స్మారక చిహ్నాలు, ఎనిమిది స్మృతి వనాలు, ఆట స్థలాలు, మూడు ఉద్యానవనాలు, రెస్టారెంట్లు నిర్మించేందుకు వీలుగా ప్రణాళికను సిద్ధం చేశారు. దీనికి కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయవలసిందిగా సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఓ పర్యాటక ప్రాంతంగా మారి తెలంగాణకు మణిహారంగా మారనుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు చూసేందుకు దూరప్రాంతాల నుంచి నిత్యం అనేకమంది పర్యాటకులు వస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విదేశీ పర్యాటకులు కూడా తరలివచ్చే అవకాశం ఉంది.