.jpg)
దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ కిసాన్ సమ్మాన్ పధకంలో భాగంగా రూ.18,000 కోట్లు నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన వివిద రాష్ట్రాలలోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. “రైతులకు మేలు చేసేందుకే వ్యవసాయ చట్టాలు తెచ్చాము. దేశవ్యాప్తంగా రైతులు వాటి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు కూడా. కానీ ఎన్నికలలో వరుసగా తిరస్కరించబడుతున్న ఓ రాజకీయ పార్టీ రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తోంది. మొదట మద్దతు ధరలను పెంచాలంటూ ఢిల్లీలో ఆందోళనలు చేసిన రైతులు ఆ తరువాత వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తుండటమే అందుకు నిదర్శనం. ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే రైతులను ఎగదోస్తున్నాయి తప్ప వాటికి రైతుల పట్ల ఎటువంటి అభిమానమూ లేదు. దశాబ్ధాలుగా అధికారంలో ఉన్నా ఏనాడూ రైతులను పట్టించుకోనివారు, రైతుల సమస్యలను పరిష్కరించలేనివారు, రైతుల భూములను కబ్జాలు చేస్తున్నవారు ఇప్పుడు రైతుల కష్టాల గురించి మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారు. రాజకీయంగా లబ్ది పొందాలనే ఉద్దేశ్యంతోనే వారు రైతులను ఆందోళనలకు ప్రోత్సహిస్తున్నారు. కనుక వారి ఉచ్చులో చిక్కుకోవద్దని,తక్షణమే ఆందోళనలు విరమించాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులు సహేతుకమైన డిమాండ్లతో వస్తే వాటిపై చర్చించి పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం సిద్దంగా ఉంది. వారిని వెనుక నుండి రెచ్చగొడుతున్న ప్రతిపక్ష పార్టీలతో కూడా చర్చించేందుకు మేము సిద్దంగా ఉన్నాము,” అని అన్నారు.
అయితే ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఈ వ్యాఖ్యలను ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నాయకులు ఖండించారు. రైతులలో చీలిక తెచ్చేందుకే ప్రధాని నరేంద్రమోడీ ఈవిధంగా మాట్లాడినట్లు భావిస్తున్నామని చెప్పారు. తాము తమ ప్రయోజనాల కోసమే ఆందోళనలు చేస్తున్నాము తప్ప రాజకీయ ప్రేరణతో చేయడం లేదని స్పష్టం చేశారు.