నేడు దివంగత ప్రధాని వాజ్‌పేయి జయంతి

నేడు మాజీ ప్రధాని, భారతరత్న, అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి. ఆయన 1924, డిసెంబర్‌25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించారు. ఆయన తల్లితండ్రుల పేర్లు కృష్ణాదేవి, కృష్ణ బిహారీ వాజ్‌పేయి. దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి చాలా నిరాడంబరుడు, స్నేహశీలి, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పేరు పొందారు.

1996లో లోక్‌సభ ఎన్నికలలో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించడంతో కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఆయన నేతృతంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆయన ప్రధానిగా ఎన్నికైనా 13 రోజులకే విశ్వాస పరీక్షలో ఒకే ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోయింది. అదే... ఇప్పుడైతే చాలా రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పాటుకు 10-20 సీట్లు తక్కువ ఉన్నా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టో లేదా బెదిరించి భయపట్టి లొంగదీసుకొని ప్రభుత్వాలు ఏర్పాటుచేసుకొంటుండటం అందరం చూస్తూనే ఉన్నాము. అజాతశత్రువుగా పేరొందిన అటల్ బిహారీ వాజ్‌పేయికి అన్ని పార్టీలలోనూ స్నేహితులున్నారు. కనుక ఆయన గట్టిగా పట్టుబట్టి ప్రయత్నిస్తే ఒకటి కాదు...10-15 సీట్లు కూడగట్టగలిగేవారు. కానీ నీతి, నిజాయితీకి విలువలకు కట్టుబడి ఉండే ఆయన రాజ్యాంగం ప్రకారమే నడుచుకొన్నారు. ఒకే ఒక్క ఓటుతో తన ప్రభుత్వం కూలిపోగానే ఆయన ఏమాత్రం సంకోచించకుండా చాలా హుందాగా తన పదవి నుంచి తప్పుకొన్నారు.

మళ్ళీ 1998-1999 సంవత్సరంల మద్యకాలంలో 13 నెలలపాటు ప్రధానిగా పని చేశారు. ఆ తర్వాత 1999 సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భాజపా అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అప్పుడు ఆయన 1999-2004 వరకు పూర్తికాలం ప్రధానిగా పని చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనే దేశంలో తొలిసారిగా అణుపరీక్ష జరిగింది. దాంతోనే భారత్‌ దేశ శక్తిసామర్ధ్యాలు యావత్ ప్రపంచదేశాలకు తెలిసివచ్చేలా చేశారు.

ఆయన హయాంలోనే దేశంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలుపుతూ స్వర్ణ చతుర్భుజి పేరిట జాతీయ రహదారుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి దేశాభివృద్ధి వేగవంతం అయ్యేందుకు ఎంతగానో తోడ్పడ్డారు. దేశానికి ఆయన చేసిన సేవలకు  2015 సంవత్సరంలో కేంద్రప్రభుత్వం ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో సన్మానించింది.