అవన్నీ ఎన్నికల ఇంజక్షన్లే: మురళీధర్ రావు

బిజెపి సీనియర్ నేత మురళీధర్ రావు సిఎం కేసీఆర్‌పై సునిశితమైన విమర్శలు చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “జీహెచ్‌ఎంసీ ఎన్నికలైపోగానే డిసెంబర్‌ 7 నుంచి వరదసాయం అందిస్తానని చెప్పారు. కానీ ఎందుకు ఇవ్వడం లేదు. వరంగల్‌లో కూడా వరదలు వచ్చాయి. కానీ అక్కడి ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు?అంటే ఎన్నికలుంటేనే సాయం చేస్తారా...లేకుంటే చేయరా?త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుకనే 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. త్వరలో నాగార్జునసాగర్ ఉపఎన్నికలు జరుగబోతున్నాయి కనుకనే అక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి చేతిలో టిఆర్ఎస్‌ ఓడిపోయినప్పటి నుంచి సిఎం కేసీఆర్‌కు భయం పట్టుకొంది. టిఆర్ఎస్‌కు కంచుకోట అని చెప్పుకొనే సిద్ధిపేట కూడా చేజారిపోతుందేమోననే భయంతోనే అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తానని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రకటిస్తున్న ఈ వరాలన్నీ తెలంగాణ ప్రజలకు సిఎం కేసీఆర్‌ ఇస్తున్న ఇంజక్షన్లే అని మేము భావిస్తున్నాము. 

రాష్ట్రంలో 12,750కు పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో సుమారు 3 లక్షల మంది ఉపాధ్యాయులు, 2 లక్షలమంది భోధనేతర సిబ్బంది, మరో లక్ష మందివరకు బస్సు డ్రైవర్లు, క్లీనర్లు వగైరా పనిచేస్తున్నారు. వారందరూ కూడా రోడ్డున పడేలా చేశారు సిఎం కేసీఆర్‌. అటు యాజమాన్యాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో కూరుకుపోగా, ఉపాద్యాయులు తమ కుటుంబాలను పోషించుకొనేందుకు రోడ్లపై మిర్చీబజ్జీలు, కూరగాయలు అమ్ముకోవలసి వస్తోంది. ప్రైవేట్ విద్యారంగం ఇంత సంక్షోభంలో కూరుకుపోయినా ఏనాడూ సిఎం కేసీఆర్‌ లేదా మంత్రులు వారితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించలేదు. 

బిజెపి గెలుస్తుందనే భయం సిఎం కేసీఆర్‌కు కలిగితే మాత్రం ప్రజలకు అన్నీ ఇస్తారు... చేస్తారు. కనుక ప్రజలు టిఆర్ఎస్‌ను ఓడిస్తుంటేనే సంక్షేమ పధకాలు అమలవుతాయి. తెలంగాణ అభివృద్ధికి టిఆర్ఎస్‌ ఓటమే రహదారి...గేట్ వే! రాబోయే వరుస ఎన్నికలలో ప్రజలు బిజెపికే ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సిఎం కేసీఆర్‌-ఓవైసీల మద్య ఉన్న చీకటి ఒప్పందాలను త్వరలోనే బిజెపి వెలుగులోకి తీసుకువచ్చి వారిరువురినీ నిలదీయబోతున్నాము,” అని అన్నారు.