ఉద్యోగాల భర్తీ కూడా పాత పద్దతిలోనే?

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టంలో ధరణీ పోర్టల్‌కు చట్టబద్దత కల్పించకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు రిజిస్ట్రేషన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కనుక నేటి నుంచి మళ్ళీ పాత ‘కార్డ్ విధానం’లోనే రిజిస్ట్రేషన్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థల వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నట్లు ముందే గుర్తించిన అధికారులు పాత జిల్లాలు, పాత జోనల్ వ్యవస్థ ప్రకారమే నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  రాష్ట్ర ప్రభుత్వం 2018లో కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేసింది. దానిలో రెండు మల్టీ జోన్లు, ఏడు జోన్లు ఉన్నాయి. ఆ తరువాత ప్రజాభీష్టం మేరకు రాష్ట్ర ప్రభుత్వం నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడ్డాయి. ప్రజల అభ్యర్ధన మేరకు వికారాబాద్‌ జిల్లాను ఛార్మినార్ జోన్లో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి ఆ ప్రతిపాదనను కేంద్రం ఆమోదానికి పంపింది. కానీ ఆ తరువాత దానిని కేంద్రంచేత ఆమోదింపజేసుకొని వెంటనే రాష్ట్రపతి చేత ఆమోదముద్ర వేయించుకోకపోవడంతో ఇప్పుడు కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయలేని దుస్థితి ఏర్పడింది. 

కనుక ఈ ప్రక్రియ మద్యలో ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా నివారించేందుకు మళ్ళీ పాత పద్దతిలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తేమంచిదని ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌కు సూచించినట్లు తెలుస్తోంది. త్వరలోనే సిఎం కేసీఆర్‌ దీనిపై వారితో సమావేశమయ్యి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

పరిపాలన, ప్రజల సౌలభ్యం కొరకే తెలంగాణ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టినప్పటికీ సాంకేతికపరమైన, న్యాయపరమైన, రాజకీయంగా ఎదురయ్యే సమస్యల గురించి లోతుగా ఆలోచించకపోవడం వలననే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నట్లున్నాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, కొత్త రెవెన్యూ చట్టం, ధరణీ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, జోనల్ వ్యవస్థల గురించి సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్‌ నేతలు ఇటువంటివి ‘నభూతో...నభవిష్యత్... దేశానికే మనం ఆదర్శం...’ అంటూ ఎన్నోసార్లు గొప్పలు చెప్పుకొన్నారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో మళ్ళీ పాత వ్యవస్థలు, పాత విధానాల ప్రకారమే పనులు చక్కబెట్టుకోవలసి వస్తోంది.