ఆదిలాబాద్‌లో మజ్లీస్ నేత తుపాకీతో కాల్పులు

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని తాటిగూడలో మజ్లీస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మునిసిపల్ ఛైర్మన్ ఫారూఖ్ అహ్మద్ శుక్రవారం సాయంత్రం తుపాకీతో కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికుల సమాచారం ప్రకారం... ఫారూఖ్ అహ్మద్‌కు తాటిగూడలో కొందరు వ్యక్తులతో పాతగొడవలున్నాయి. ఇవాళ్ళ సాయంత్రం మళ్ళీ వారి మద్య చిన్న గొడవ జరగడంతో ఫారూక్ హటాత్తుగా జేబులో నుంచి తుపాకీ బయటకు తీసి ప్రత్యర్ధులపై కాల్పులు జరిపాడు. మరోచేత్తో తల్వార్‌ (కత్తి) పట్టుకొని కాసేపు హల్‌చల్ చేశారు. ఫారూక్ పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఓ చేత్తో తుపాకీ, మరో చేత్తో కత్తి పట్టుకొని హడావుడి చేయడంతో స్థానికులు భయపడి పరుగులు తీశారు.

ఫారూక్ జరిపిన కాల్పులలో మోసిన్ అనే వ్యక్తికి బులెట్ తలలో నుంచి దూసుకుపోగా, మరో వ్యక్తికి పొట్టలోకి దూసుకుపోయింది. సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఫారూక్‌ నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాధమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం అంబులెన్సులో హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.