తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఛైర్మన్ ఘంటా చక్రపాణి గురువారం పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా హైదరాబాద్లోని ప్రతిభా భవన్లో ఆయనకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. దానికి హాజరైన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలో 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఇటువంటి కీలకమైన సమయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఎంతో సమర్ధంగా నిర్వహించిన ఘంటా చక్రపాణి పదవీ విరమణ చేస్తుండటం, టీఎస్పీఎస్సీలో మరో ముగ్గురు సభ్యుల పదవీకాలం పూర్తవడం మా అందరికీ చాలా ఇబ్బందికరంగానే మారుతుందనుకొంటున్నాము. గత 5 ఏళ్ళలో ఎటువంటి సమస్యలు లేకుండా 35,000 ఉద్యోగాలను భర్తీ చేసి ఘంటా చక్రపాణి టీఎస్పీఎస్సీని ఎంతో పారదర్శకంగా నడిపించారు,” అని ప్రశంసించారు.
ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి మాట్లాడుతూ, “ఒకేసారి 50,000 ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. జోనల్ వ్యవస్థకు సంబందించి రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్లు విడుదల చేయవలసి ఉంటుంది కనుక నా కార్యాలయంలో దీనికోసం ప్రత్యేకంగా ఓ టీంను ఏర్పాటుచేసి నోటిఫికేషన్ల జారీ.. తదనంతర ప్రక్రియలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకొంటాము. ఇప్పటికే శాఖలు వారీగా ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఆయా శాఖలలో ఖాళీల వివరాలను సేకరించి నివేదికలు రూపొందిస్తున్నాము. ఆ వివరాలన్నీ సేకరించిన తరువాత సిఎం కేసీఆర్ ఆమోదంతో నోటిఫికేషన్ జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తాము,” అని సోమేష్ కుమార్ అన్నారు.