వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు తాజా ఆదేశాలు

వ్యవసాయేతర ఆస్తులను ధరణీ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేయడంపై స్టే విదించిన హైకోర్టు పాత పద్దతిలో ‘కార్డ్ విధానం’ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుపుకొనేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే కార్డ్ విధానంలో రిజిస్ట్రేషన్ల కొరకు వ్యక్తుల ఆధార్, కులం, కుటుంబ వివరాలు వగైరాలు సేకరిస్తుండటంతో దానిని సవాలు చేస్తూ గోపాల్ శర్మ, సాకేత్ అనే ఇద్దరు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై నేడు విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ధరణీ ద్వారా వ్యక్తిగత వివరాలను సేకరించవద్దని ఆదేశిస్తే ప్రభుత్వం తెలివిగా కార్డ్ విధానం ద్వారా వివరాలను సేకరిస్తోందని, ఇది హైకోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించడమేనని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. కనుక తక్షణమే రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో సాఫ్ట్‌వేర్‌లో నుంచి ఆధార్, కులం, కుటుంబ వివరాలున్న కాలమ్స్ ను తొలగించాలని, వాటిని తొలగించిన తరువాతే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలుపెట్టాలని, అంతవరకు స్లాట్ బుకింగ్స్, పీటీఐఎన్‌లను నిలిపివేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసిన తరువాత ఆ వివరాలు తమకు సమర్పించాలని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.