
ఏపీ, తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు ఇష్టారీతిన ఎల్ఆర్ఎస్లు మంజూరు చేస్తుండటం వలననే మూడు రాష్ట్రాలలో అక్రమకట్టడాలు పుట్టుకొస్తున్నాయని, వాటి కారణంగానే వర్షాలు పడినప్పుడల్లా నగరాలు, పట్టణాలను వరదలు ముంచెత్తుతున్నాయంటూ జనగామకు చెందిన జువ్వాది సాగర్ రావు అనే వ్యక్థ్ సుప్రీంకోర్టులో ఓ ప్రజాహితవాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వాలే ఎల్ఆర్ఎస్ పధకంతో అక్రమలేఅవుట్లకు అనుమతులు మంజూరు చేస్తూ మళ్ళీ అక్రమకట్టడాలు అంటూ వాటిని కూల్చివేస్తూ సామాన్యమద్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని పిటిషన్లో ఆరోపించారు. దీనికి ప్రభుత్వాలు, అధికారులు, బిల్డర్లు బాధ్యత వహించి ఉండాలి తప్ప ఆ ఇళ్ళను కొనుగోలుచేసిన ప్రజలు కారని పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్పై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వం, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలను సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ను పధకాన్ని ప్రకటించగానే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఏకంగా 25.59 లక్షల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.