17.jpg)
దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలపై టిఆర్ఎస్ పార్టీలో అంతర్మదనం మొదలైంది. పార్టీలో కొందరు సీనియర్ నేతలు ఇటీవల సీఎం కేసీఆర్కు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ వలన సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశంపై త్వరలోనే రాష్ట్రంలోని రియల్టర్లతో, వివిధ సంఘాలతో, ప్రజలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకొంటే బాగుంటుందని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ఎల్ఆర్ఎస్పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నందున ప్రజలలో అపోహలు నెలకొన్నాయని కనుక దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ఈ పధకంలో సామాన్య ప్రజలకు వెసులుబాటు కల్పించాలని సూచించారు.
వారి సూచనలపై సిఎం కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి అధికారులతో చర్చించగా వారు మూడు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. 1 ఎల్ఆర్ఎస్ను పూర్తిగా ఎత్తివేయడం. 2. ఎల్ఆర్ఎస్ ఫీజులు తగ్గించడం. 3. సామాన్య ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు ఎల్ఆర్ఎస్ ఫీజును రెండు లేదా మూడు విడతలలో వసూలు చేయడం. ఎల్ఆర్ఎస్ వలన అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని సీఎం కేసీఆర్ కూడా భావిస్తున్నారు. కనుక టిఆర్ఎస్ సీనియర్ నేతలు, అధికారులు ఇచ్చిన ఈ సలహాలు, ప్రతిపాదనలపై సిఎం కేసీఆర్ మళ్ళీ సంబందిత అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.