
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో అందరికీ నెలకు 20,000 లీటర్లు మంచినీటిని ఉచితంగా అందజేస్తామని టిఆర్ఎస్ హామీ ఇచ్చింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ. 153.65 కోట్లు ఆర్ధికభారం పడనుంది. నగరంలో మొత్తం 10.50 లక్షల తాగునీటి నల్లా కనెక్షన్లున్నాయి. ఇవికాక నల్లా కనెక్షన్ లేకుండానే అక్రమంగా నీటిని వినియోగించుకొంటున్నవారు చాలామందే ఉన్నారు. కనుక ఈ పధకాన్ని మరింత సమర్ధంగా, పారదర్శకంగా నిర్వహించవలసిన అవసరం ఏర్పడింది.
అందుకే ఈ ప్రయోజనం పొందాలనుకొనేవారు తప్పనిసరిగా తమ ఆధార్ వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ శుక్రవారం ఓ జీవో జారీ చేశారు. ఒకవేళ ఆధార్ కార్డ్ లేనట్లయితే వెంటనే దరఖాస్తు చేసుకొని ఆ రశీదు చూపినా సరిపోతుంది. ఆధార్ కార్డ్ వచ్చేలోగా పాన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, ఓటరుకార్డు, రేషన్ కార్డ్ వంటివి ఏవైనా సమర్పించవచ్చు. కొత్తగా నల్లా కనెక్షన్లకు దరఖాస్తు చేసుకొనేవారు, ఇప్పటికే నల్లాలు ఉన్నవారందరూ కూడా తమ ఆధార్ కార్డ్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
నగరంలో అనేకమంది త్రాగునీటిని దొంగతనంగా వాడుకొంటున్నారని జీహెచ్‌ఎంసీకి తెలిసి ఉన్నప్పటికీ వారిని అడ్డుకొని, అక్రమ కనెక్షన్లను తొలగించే సాహసం చేయలేకపోతోంది. కనుక ఇప్పటికైనా అక్రమంగా నీటిని వాడుకొంటున్నవారిని గుర్తించి వారిని కూడా క్రమబద్దీకరించడమో లేదా నల్లా కనెక్షన్ తొలగించడమో చేస్తే టంచన్‌గా బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులతో పాటు ప్రభుత్వంపై కూడా భారం తగ్గుతుంది.