
సిఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు. మళ్ళీ ఆదివారం హైదరాబాద్ తిరిగివస్తారు. ఈ పర్యటనలో సిఎం కేసీఆర్ కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షికావత్, హర్దీప్సింగ్ పురిలను కలిసి రాష్ట్రానికి సంబందించిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విడుదల గురించి చర్చించనున్నారు. ఇప్పటికే వారిరువురితో అపాయింట్మెంట్ కూడా ఖరారయింది. నిన్న జరిగిన కొత్త పార్లమెంటు భవనం శంఖుస్థాపన కార్యక్రమానికి సిఎం కేసీఆర్ హాజరు కాలేకపోయినందున ఈ పర్యటనలో వీలైతే ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రహోంమంత్రి అమిత్ షాలను కూడా కలిసి అభినందనలు తెలిపే అవకాశం ఉంది.
ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించుకొనేందుకు 1,100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్రప్రభుత్వం కేటాయించింది. ఈ పర్యటనలో సిఎం కేసీఆర్ దానికి శంఖుస్థాపన చేయవచ్చునని సమాచారం.
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయచట్టాలను టిఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తున్నందున ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుసంఘాల నేతలను, వారికి మద్దతు ఇస్తున్న ప్రధానప్రతిపక్ష నేతలను కూడా సిఎం కేసీఆర్ కలిసి మాట్లాడే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వం రైతుల డిమాండ్లకు ఒప్పుకోనందున త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జిల్లా కేంద్రాలలో, టోల్గేట్ల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. రైతులు మొదలుపెట్టిన ఈ ఆందోళనలను ఏవిధంగా కొనసాగించి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనే అంశంపై సిఎం కేసీఆర్ ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతలతో చర్చించబోతున్నట్లు సమాచారం.