.jpg)
పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ టాగూర్ నిన్న గాంధీభవన్లో కోర్ కమిటీ సమావేశం నిర్వహించి పార్టీ సీనియర్ నేతలందరితో మాట్లాడారు. ఆ తరువాత పిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలందరితో కూడా మళ్ళీ విడివిడిగా మాట్లాడారు. ఇవాళ్ళ, రేపు జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యదర్శులతో కూడా సమావేశమయ్యి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొంటారు. అందరి అభిప్రాయాలను కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేస్తారు. దానిని బట్టి పిసిసి అధ్యక్ష పదవికి తగిన వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసి ప్రకటిస్తుంది.
ఈ పదవికి పోటీ పడుతున్నవారిలో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఒకరు. నిన్న గాంధీభవన్లో సమావేశం ముగిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పిసిసి అధ్యక్ష పదవి చేపట్టడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. కనుక తప్పకుండా నాకే లభిస్తుందని భావిస్తున్నాను. మూడునాలుగురోజులలో ఇది మీరే వింటారు. నాకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే నేను కూడా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేసి 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు గట్టిగా కృషి చేస్తాను. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నమాట వాస్తవం. అయితే అన్ని పార్టీలలోనూ గ్రూపులు ఉంటాయి. నేను అధ్యక్షుడిగా ఎంపికైతే అందరినీ కలుపుకొని ముందుకుసాగుతాను. ఒకవేళ నాకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వకపోయినా నేను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టను. పార్టీలోనే కొనసాగుతాను. పదవుల కోసం పార్టీలు మారేవాడిని కాను,” అని అన్నారు.