సిద్ధిపేటలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం: కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం సిద్ధిపేట జిల్లాలోని కొండపాక మండలంలో దుద్దెడలో ఐ‌టి టవర్స్‌కు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సిద్ధిపేట జిల్లా చైతన్యవంతమైనది రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో ఒకటి. రాజధాని హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో సిద్ధిపేట జిల్లా ఉంది. కనుక ఇక్కడ నిర్మిస్తున్న ఐ‌టి టవర్స్‌ పూర్తయితే భవిష్యత్‌లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం రావచ్చు. ఇక్కడ ఐ‌టి కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినవారందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు. రూ.45 కోట్లు వ్యయంతో  సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో టిఎస్‌ఐఐసీ ఈ టవర్స్‌ను నిర్మిస్తోంది. ఏడాదిలోగా దీని నిర్మాణం పూర్తి చేయాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ ఐ‌టి టవర్స్‌లో సెట్విన్, ఎంబ్రోడ్స్ టెక్నాలజీ, జోలాన్ టెక్నాలజీ, విసాన్ టెక్ తదితర కంపెనీలు తమ ఐ‌టి కార్యకలపాలు ప్రారంభించేందుకు ముందుకువచ్చాయి. వాటి ద్వారా సుమారు 2,000 మందికి ప్రత్యక్షంగా, కొన్ని వందల మందికి పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాది అవకాశాలు లభించనున్నాయి. 

ఐ‌టి టవర్స్‌కు శంఖుస్థాపన కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.