
తెలంగాణ కార్మికశాఖామంత్రి మల్లారెడ్డి కుమారుడిపై శ్యామలాదేవి అనే ఒక మహిళ దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో డిసెంబర్ 6వ తేదీన ఫిర్యాదు చేయడంతో హైకోర్టు ఆదేశం మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
శ్యామలాదేవి చెప్పిన సమాచారం ప్రకారం, ఆమె తల్లి పొన్నబోయిన పద్మావతికి సర్వే నెంబర్ 115, 116,117 లలో 2.13 ఎకరాల భూమి ఉంది. దానిని తమకు విక్రయించాలని మంత్రి మల్లారెడ్డి కుమారుడు, వారి అనుచరులు గత మూడేళ్ళుగా వేదిస్తున్నారు. దీనిపై తాము పోలీసులను ఆశ్రయించినా మల్లారెడ్డిపై కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. దాంతో తాము హైకోర్టును ఆశ్రయించేందుకు లక్ష్మినారాయణ అనే న్యాయవాదిని కలిసి మాట్లాడగా, ఆయన మంత్రి మల్లారెడ్డితో కుమ్మక్కయ్యి హైకోర్టులో పిటిషన్ వేసేందుకు అని చెప్పి ఖాళీ స్టాంప్ పేపర్లపై తమ సంతకాలు తీసుకొన్నారని శ్యామలాదేవి తెలిపారు. వాటిని ఆయన మంత్రి మల్లారెడ్డికి ఇచ్చేశారని, ఆ స్టాంప్ పేపర్లపైనే తాము రూ.8 లక్షలకు వారికి సేల్ అగ్రిమెంట్ చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, ఆ భూమిని ఇప్పుడు తమ అనుచరుడు గూడూరు మస్తాన్‌కు అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారని శ్యామలాదేవి ఫిర్యాదులో పేర్కొన్నారు. మల్లారెడ్డి అనుచరులు తనను తన భూమిలో అడుగుపెట్టనీయకుండా అడ్డుకొంటున్నారని శ్యామలాదేవి ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి వర్గం నుంచి వస్తున్న ఈ ఒత్తిళ్ళను తట్టుకోలేక తన తల్లి పద్మావతి, సోదరి మరణించారని, ఇప్పుడు ఒంటరిగా ఉన్న తనపై మరింత ఒత్తిడి పెరిగిపోయిందని శ్యామలాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి కుమారుడు, వారి అనుచరుల వలన తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆమె పిర్యాదులో పేర్కొన్నారు.