ధరణీపై హైకోర్టు స్టే పొడిగింపు

వ్యవసాయేతర ఆస్తులను ధరణీ పోర్టల్‌లో నమోదు చేయడంపై ఈనెల 10వ తేదీ వరకు హైకోర్టు స్టే పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్ కొరకు ధరణీ పోర్టల్‌ను వినియోగించవచ్చని పేర్కొనకపోవడంతో దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై హైకోర్టు చేసిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ధరణీ కోసం మూడు జీవోలు జారీ చేసింది. అయితే వాటిపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గోపాల్ శర్మ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో నేడు మళ్ళీ దానిపై విచారణ జరిపింది. 

ఈ సందర్భంగా ప్రభుత్వ అటార్నీ జనరల్ స్టే విధించడం వలన రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు దృష్టికి తీసుకురాగా, తాము రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఎన్నడూ ఆదేశించలేదని స్పష్టం చేసింది. ధరణీలో డేటా భద్రత, దాని వినియోగంపై విచారణ జరుగుతున్నందున దానిని వినియోగించి రిజిస్ట్రేషన్లు చేయవద్దని మాత్రమే ఆదేశించామని హైకోర్టు స్పష్టం చేసింది. పాత పద్దతిలో యదాప్రకారం వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని తెలిపింది. 

తాజాగా దాఖలైన పిటిషన్‌పై ఈనెల 10లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, అప్పటి వరకు వ్యవసాయేతర ఆస్తులను ధరణీ పోర్టల్‌లో నమోదు చేయరాదని స్టేను పొడిగిస్తున్నట్లు తెలిపింది.