
ఈనెల 7నుంచి మళ్ళీ హైదరాబాద్‌లోని వరదబాధితులకు రూ.10,000 చొప్పున వరదసాయం అందిస్తామని సిఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారసభలో ప్రకటించినందున సోమవారం తెల్లవారుజాము నుంచే నగరంలో అన్ని మీసేవా కేంద్రాలవద్ద ప్రజలు బారులుతీరారు. దాంతో మళ్ళీ మీసేవా కేంద్రాలపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోవడంతో కొన్ని చోట్ల మూసుకోవలసివచ్చింది.
ఆల్వాల్‌లోని మీసేవా కేంద్రం తెరవకపోవడంతో వరదసాయం కోసం వచ్చిన ప్రజలు రోడ్డుపై బైటాయించి ధర్నాచేశారు. నగరంలో మరికొన్నిచోట్ల ప్రజలు ఆగ్రహంతో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ఇళ్లను చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. కొన్ని ప్రాంతాలలో పోలీసులు కలుగజేసుకొని ప్రజలకు నచ్చజెప్పవలసి వచ్చింది. వరదబాధితులను ఆదుకోవడం మంచిదే కానీ దానికి ప్రభుత్వం ఎంచుకొన్న ఈవిధానమే సరిగాలేదని స్పష్టమవుతోంది.
వరదసాయం కోసం మీసేవా కేంద్రాలవద్ద నిలబడుతున్నవారిలో సామాన్య, మద్యతరగతి, నిరుపేదప్రజలే ఎక్కువమంది ఉంటారు. రెక్కాడితే కానీ డొక్కాడని వారు ప్రతీరోజు పనులుమానుకొని వరదసాయం సొమ్ము కోసం రోజూ మీసేవాకేంద్రాల వద్ద నిలబడటం చాలా కష్టం. ఒకవేళ పనులుమానుకొని నిలబడినా చివరికి వరదసాయం అందకపోతే వారికి ప్రభుత్వంపై మరింత ఆగ్రహం పెరుగుతుంది. కనుక ఈవిధంగా ఇంకా ఎంతకాలం వరదసాయం పంపిణీ చేసినా బాధితులందరికీ సాయం అందించడం కష్టమే. పైగా మంచికిపోతే చెడు ఎదురైనట్లు ప్రభుత్వమే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ఇకనైనా ప్రత్యామ్నాయమార్గాలలో వరదసాయం అందించడం మంచిది.