షాద్‌నగర్‌లో మంత్రి కేటీఆర్‌, ఎంపీ రేవంత్‌ నేడు ధర్నా

ఈరోజు జరుగబోయే భారత్‌ బంద్‌కు సిఎం కేసీఆర్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించినందున తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపుమేరకు మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్‌ నేతలు కూడా పాల్గొనున్నారు. మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ స్వయంగా రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గంలో బూర్గులవద్ద హైదరాబాద్‌-బెంగళూరు జాతీయరహదారిపై బంద్‌లో పాల్గొంటారు.  నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టేక్రియాల్ గేట్ వద్ద బంద్‌లో పాల్గొంటారు. మంత్రి హరీష్‌రావు గజ్వేల్‌ నియోజకవర్గంలో తూప్రాన్‌ వై జంక్షన్‌ వద్ద నాగ్‌పూర్‌కు వెళ్ళే జాతీయరహదారిపై బంద్‌లో పాల్గొంటారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు మడికొండ వద్ద, ప్రశాంత్ రెడ్డి వేల్పూరులో, సత్యవతి రాథోడ్ మహబూబాబాద్‌లో బంద్‌లో పాల్గొంటారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమతమ నియోజకవర్గాలలో జరిగే బంద్‌లో పాల్గొంటారు. మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు బంద్‌ ముగిసిన తరువాత బయటకువచ్చే అవకాశం ఉంది.  

రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాలు, తెలంగాణ జనసమితి తదితర పార్టీలు కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించినందున ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా నేడు బంద్‌లో పాల్గొనబోతున్నారు.  

కాంగ్రెస్‌ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి షాద్‌నగర్ మార్కెట్ కమిటీ వద్ద బంద్‌లో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి చౌరస్తా వద్ద బంద్‌లో పాల్గొంటారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ జాతీయ రహదారిపై బంద్‌లో పాల్గొనబోతున్నారు. హైదరాబాద్‌ కోఠి ఉమెన్స్‌ కళాశాల నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ వరకు జరుగబోయే ర్యాలీలో తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్‌ పాల్గొంటారు. ఇటువంటి కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండే వామపక్షాలు ఒకరోజు ముందుగానే అంటే సోమవారం నగరంలో బాగ్‌లింగంపల్లి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి బంద్‌కు సిద్దమయ్యాయి. ఇవాళ్ళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోను బంద్‌ నిర్వహిస్తామని వామపక్షాలు ప్రకటించాయి.