సిఎం కేసీఆర్, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు జరుగబోయే భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించడమేకాక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడంపై బిజెపి ఎమ్మెల్సీ రామచందర్ రావు భిన్నంగా స్పందించారు.
ఆయన నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపిలో చేతిలో ఓడిపోవడంతో జీర్ణించుకోలేకపోతున్న సిఎం కేసీఆర్, కేటీఆర్ రైతుల పోరాటానికి మద్దతు ఇస్తున్నామంటూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని బిజెపిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటున్నారు. రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలను చూసి సిఎం కేసీఆర్, కేటీఆర్ ఓర్వలేకపోతున్నారు.
కేంద్రప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది కనుకనే వారికి తీవ్రంగా నష్టం కలిగిస్తున్న దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు వ్యవసాయచట్టాలను ప్రవేశపెట్టింది. వాటిపై రైతులు అభ్యంతరాలు చెప్పగానే వారితో కేంద్రమంత్రులు చర్చలు జరుపుతున్నారు. వారు కోరినట్లు వ్యవసాయచట్టాలలో అవసరమైన మార్పులుచేర్పులు చేసేందుకు కేంద్రప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది కూడా. కానీ కాంగ్రెస్, వామపక్షాలు తమ స్వార్ధరాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టి బంద్‌కు ఉసిగొల్పాయి. తెలంగాణలో కూడా కమీషన్ ఏజంట్లు, బలమైన దళారీ వ్యవస్థ ఉంది. దాని వలన రాష్ట్రంలో రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టంతో ఆ దళారీ వ్యవస్థ తొలగిపోతే రాష్ట్రంలో రైతులకు కూడా చాలా మేలు కలుగుతుంది. కానీ స్వార్ధరాజకీయ ప్రయోజనాల కోసం రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించి రైతులకు హాని చేస్తున్నాయి,” అని ఎమ్మెల్సీ రామచందర్ రావు అన్నారు.