.jpg)
ఈనెల 8న జరుగబోయే భారత్ బంద్‌లో తెరాస శ్రేణులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వం తెచ్చిన రైతువ్యతిరేక చట్టాల వలన తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోతారని, కనుక రైతుల పోరాటానికి సంఘీభావం తెలుపుతూ బంద్‌లో అందరూ పాల్గొనాలని కేటీఆర్ కోరారు.
తెలంగాణలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పధకాలు అమలుచేస్తుంటే, కేంద్రప్రభుత్వం రైతులను దెబ్బతీసేవిధంగా చట్టాలు తీసుకురావడం చాలా శోచనీయమని అన్నారు. కనుక కేంద్రప్రభుత్వానికి తెలంగాణ రైతులు, ప్రభుత్వం తరపున స్పష్టమైన సందేశం పంపించడానికి ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు.
అయితే ఈ బంద్ వలన రాష్ట్రంలో వ్యాపారులు, వాణిజ్య సంస్థలు నష్టపోకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కనుక మధ్యాహ్నం 12 గంటల తరువాత యధాప్రకారం దుకాణాలు, మార్కెట్లు తెరుచుకోవచ్చని కేటీఆర్ అన్నారు. అదేవిదంగా ఆర్టీసీ బస్సులు, ఇతర సరుకు రవాణా వాహనాలు మధ్యాహ్నం 12 తరువాతే రోడ్లపైకి రావాలని కేటీఆర్ సూచించారు.
బంద్ సందర్భంగా టిఆర్ఎస్ ప్రజాప్రనిధులు అందరూ పార్టీ శ్రేణులతో కలిసి జాతీయరహదారులపై మధ్యాహ్నం 12 గంటల వరకు రాస్తారోకో నిర్వహించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేసారు.