
తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి చాలా యాక్టివ్‌గా ఉండేవారు. కానీ 2018 శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. కానీ ఏ నోముల కారణంగా ఆయన రాజకీయాలకు దూరం అయ్యారో ఇప్పుడు ఆ నోముల కారణంగానే మళ్ళీ మేల్కొని రాజకీయాలలో తన సత్తాచాటుకొనే అవకాశం వచ్చింది.
అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు...బిజెపి నుంచి! నోముల ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి ఉపఎన్నికలు అనివార్యం కనుక జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని పోటీ చేయించాలని బిజెపి అప్పుడే పావులు కదుపుతోంది.
నిజానికి జానారెడ్డి 2018 ఎన్నికలలోనే తనకు బదులు తన కుమారుడికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు ఆయనే పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన అభీష్టం మేరకు రఘువీర్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు బిజెపి సిద్దం అవుతోంది. రఘువీర్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కానీ తండ్రిని సంప్రదించిన తరువాత సమాధానం చెపుతానని బిజెపి నేతలు చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మరోపక్క రాష్ట్రంలో బిజెపి టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. కుమారుడిని ఎమ్మెల్యేగా చూడాలనే ఆయన అభీష్టం ఈవిధంగా నెరవేరుతుంది కూడా. కనుక బిజెపి ఆఫర్‌కు జానారెడ్డి ఓకే చెప్పే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ ఆయన ఓకే చెపితే తండ్రీకొడుకులు ఇద్దరూ బిజెపిలో చేరుతారు. అదే కనుక జరిగితే సాగర్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వారిరువుతోనే పోరాడవలసిరావచ్చు. బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన జానారెడ్డి బిజెపిలో చేరితే సాగర్ ఉపఎన్నికలు టిఆర్ఎస్‌కు మరో అగ్నిపరీక్షగా మారే అవకాశం కూడా ఉంటుంది.