ఓల్డ్ మలక్‌పేటలో పోలింగ్ రద్దు

ఉదయం 11 గంటలవుతున్నా జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ఇంకా పుంజుకోలేదు. ఇప్పటివరకు కేవలం 8.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 

ఓల్డ్ మలక్‌పేటలోని 26వ డివిజన్‌ పోలింగ్ బూత్‌లో బ్యాలెట్ పేపర్లపై సిపిఐ ఎన్నికల చిహ్నమైన కంకి కొడవలికి బదులు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు ముద్రించబడినట్లు రిటర్నింగ్ అధికారి గుర్తించడంతో ఆ డివిజన్‌లో పోలింగ్ రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఓల్డ్ మలక్‌పేటలో 1, 2,3,4,5 పోలింగ్ కేంద్రాలలో కూడా ఇదే కారణంతో పోలింగ్ నిలివేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. 

జియాగూడాలో 38వ పోలింగ్ కేంద్రంలో 914 ఓటర్లు ఉండగా వారిలో 719 మంది ఓట్లు గల్లంతయ్యాయి. దాంతో ఓట్లు వేయడానికి వచ్చిన వారందరూ ఆందోళనకు దిగారు. చంద్రాయణగుట్టలోని ఇంద్రానగర్ కాలనీలో కూడా భారీగా ఓట్లు గల్లంతవడంతో వారు కూడా ఆందోళనకు దిగారు. 

పటాన్‌చెరు డివిజన్‌లోని చైతన్య స్కూల్ వద్ద టిఆర్ఎస్‌-బిజెపి కార్యకర్తల మద్య ఘర్షణ జరగడంతో కాసేపు పోలింగ్‌కు అంతరాయం కలిగింది. కానీ వెంటనే పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టడంతో మళ్ళీ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 

బంజారాహిల్స్ డివిజన్‌లో బిజెపి కార్యకర్తలు కాషాయమాస్కూలు, టిఆర్ఎస్‌ కార్యకర్తలు గులాబీ మాస్కూలు ధరించి పోలింగ్ కేంద్రాలవద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని పోలింగ్ కేంద్రానికి దూరంగా పంపించివేశారు.  

బంజారాహిల్స్ డివిజన్‌లో 43 నుంచి 49వరకు గల పోలింగ్ కేంద్రాల వద్దకు భారీ సంఖ్యలో టిఆర్ఎస్‌-బిజెపి కార్యకర్తలు చేరుకోవడంతో వారి మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు వారినిపోలింగ్ కేంద్రానికి దూరంగా పంపించివేయడంతో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన 58వ పోలింగ్ బూత్‌ వద్ద టిఆర్ఎస్‌ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  

గ్రేటర్ పరిధిలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఇంచుమించు ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయి. కానీ ఈసారి చాలా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కంటే టిఆర్ఎస్‌, బిజెపి నేతలు, కార్యకర్తల హడావుడే ఎక్కువగా కనిపిస్తోంది.