జీహెచ్‌ఎంసీలో గల 150 డివిజన్‌లకు మొత్తం 1,122 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వారిలో టిఆర్ఎస్ నుంచి 150, బిజెపి 149, కాంగ్రెస్ 146, టిడిపి 106, మజ్లీస్ 51, సిపిఐ 17, సిపిఎం 12, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 76, స్వతంత్ర అభ్యర్ధులు 415మంది ఈ ఎన్నికలలో పోటీ పడుతున్నారు. ఎన్నికల సంఘం నగరంలో 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. గత ఎన్నికలలో ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహించగ ఈసారి బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ జరుపుతోంది. నగరంలో 150 డివిజన్లలో ప్రస్తుతం 74, 67, 256 మంది ఓటర్లున్నారు.
గత ఎన్నికలలో కేవలం 46 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకొన్నారు. అంటే ఓటర్లలో సగం కంటే తక్కువమంది మాత్రమే వచ్చి ఓట్లు వేశారన్నమాట. కనుక ఈసారి పోలింగ్ శాతం పెంచాలనే ఉద్దేశ్యంతో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్ని పార్టీలు, రాష్ట్ర ఎన్నికల సంఘం నగరప్రజలకు పదేపదే చెప్పాయి కానీ ఓటర్లలో చైతన్యం వచ్చినట్లు లేదు. ఉదయం 9.30 గంటలకు కేవలం 3.10 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇదే లెక్కన పోలింగ్ సాగితే ఈసారి కూడా పోలింగ్ 45-46 శాతానికి మించకపోవచ్చు. ఇదే కనుక జరిగితే విద్యావంతులైన నగర ఓటర్ల కంటే గ్రామాలలో ఉండే నిరక్షరాస్య ఓటర్లే ఎక్కువ బాధ్యత కలిగినవారని, విజ్ఞులు, సామాజిక స్పృహగలవారని భావించకతప్పదు.