జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: 0.14 శాతం పోలింగ్ నమోదు

ఈరోజు ఉదయం 7 గంటల నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 

పోలింగ్ మొదలవగానే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడలో, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కేటీఆర్‌ దంపతులు బంజారాహిల్స్‌లో, చిరంజీవి దంపతులు జూబ్లీహిల్స్‌లో, ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శాస్త్రిపురం డివిజన్‌లోని సేంట్‌ఫైజ్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు. ఇంకా అనేకమంది పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూలైన్లో నిలబడి ఓట్లు వేస్తున్నారు.     

ఈసారి టిఆర్ఎస్‌, బిజెపి, మజ్లీస్‌ పార్టీలు హోరాహోరీ ప్రచారం చేయడంతో ఎన్నికలు ఆసక్తిగా మారినందున పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. కానీ మొదటి రెండు గంటలలో 0.14 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. నగరంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు పోలింగ్ బూత్‌లకు రావడం ఆలస్యమై ఉండవచ్చు. ఈనెల 4న ఓట్లు లెక్కించి వెంటవెంటనే ఫలితాలు ప్రకటించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.