ఓటమి భయంతోనే బిజెపి డ్రామాలు: హరీష్‌రావు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఓడిపోవడం ఖాయమని బిజెపి నేతలు గ్రహించినందునే ఎన్నికల సంఘం ముందు డ్రామా ఆడారని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. ఆవిధంగానైనా జనాల సానుభూతి సంపాదించి మరో నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని ప్రయత్నించారని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం బిజెపి ఏకంగా 12 మంది కేంద్రమంత్రులను, జాతీయ అధ్యక్షుడు, చివరికి ప్రధాని నరేంద్రమోడీని కూడా దింపిందని, అయినా బిజెపిని ఓటమిభయం వెంటాడుతుండటం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు.

బిజెపి సోషల్ మీడియా ప్రత్యర్ధులపై దుష్ప్రచారం చేయడంలో ఆరితేరిపోయిందని, ఈవిషయంలో బిజెపికి నోబుల్ బహుమతి వస్తుందని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాను కాస్త బిజెపి ఫేక్ మీడియాగా మార్చేసిందని అన్నారు. దుబ్బాక ఉపఎన్నికల ముందు కాంగ్రెస్‌ అభ్యర్ధి మళ్ళీ టిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు, నేను, మరి కొందరు టిఆర్ఎస్‌ నేతలు వేరే పార్టీలో చేరబోతున్నట్లు నకిలీ వీడియోలు తయారుచేయించి మాపై కూడా బురదజల్లాలని ప్రయత్నించిందని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు.

ఓటమి భయంతో తీవ్ర నిరాశానిస్పృహలలో ఉన్న బిజెపి నగరంలో అల్లర్లు సృష్టించడానికి కూడా సిద్దమైందని, దానికి సంబందించి ప్రభుత్వం వద్ద పక్కా ఆధారాలున్నాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ రేపు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసారు.