
జీహెచ్‌ఎంసీ ఎన్నికలను టిఆర్ఎస్, బిజెపి, మజ్లీస్ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడాయి కనుక ఎట్టి పరిస్థితులలో తామే గెలవాలని కోరుకోవడం సహజం. అందుకు అవి తమ ముందున్న అన్ని మార్గాలను వినియోగించుకోవడం కూడా సహజమే. ఈ ప్రయత్నంలో ఆ మూడు పార్టీల మద్య ఘర్షణలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కనుక నగరమంతా ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించింది పోలీస్ శాఖ. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
ఈ ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిపి సజ్జనార్ నగరంలోని అన్ని పోలింగ్ కేంద్రాలవద్ద భారీగా పోలీసులను మోహరించి పటిష్టమైన భద్రత ఏర్పాట్లుచేసారు. రేపు జరుగబోయే పోలింగ్ కోసం 13,500 మంది పోలీసులను మోహరించినట్లు ఆయన చెప్పారు.
నగరంలో మొత్తం 2,437 పోలింగ్ స్టేషన్లు ఉండగా వాటిలో 1,421 పోలింగ్ కేంద్రాలలో సాధారణ పరిస్థితులున్నాయని కానీ మిగిలిన వాటిలో 766 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా, 250 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి అందుకు తగ్గట్లుగా బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ముందుజాగ్రత్తగా నగరంలో 369 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకొన్నామని, 587 లైసెన్స్డ్ రివాల్వర్లను వెనక్కు తీసుకొన్నామని చెప్పారు. ప్రతీ పోలింగ్ కేంద్రంవద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పోలింగ్ ముగిసేవరకు 177 మొబైల్ స్క్వాడ్స్ పోలింగ్ కేంద్రాల మద్య తిరుగుతూ పరిస్థితులు చేజారకుండా చూస్తాయని చెప్పారు. అన్ని పార్టీల అభ్యర్ధులు, వారి అనుచరులు అందరూ తప్పనిసరిగా ఎన్నికల నిబందలను తూచా తప్పకుండా పాటించాలని లేకుంటే కటిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని సిపి సజ్జనార్ హెచ్చారించారు.