
ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రలోభాలపర్వం మొదలైంది. టిఆర్ఎస్ నేతలు బహిరంగంగా డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని, పైగా డబ్బులు పంచుతున్నవారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన బిజెపి నేతలను, కార్యకర్తలనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఇంద్రసేనారెడ్డి తదితర బిజెపి నేతలు హైదరాబాద్‌లోని ఎన్నికల సంఘం ఎదుట ధర్నా చేశారు. టిఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులను, అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని లేకుంటే రేపు నిష్పక్షపాతంగా పోలింగ్ జరుగకపోవచ్చని రామచంద్రరావు ఆరోపించారు.
బిజెపి నేతలు ఎన్నికల సంఘం కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్ళేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఘోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని తాము కోరుతుంటే, తమనే అరెస్ట్ చేయడం ఏమిటని రఘునందన్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పోలీసులు, అధికారులు, ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సంఘం తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందంటూ హెచ్చరించారు. అయితే బండి సంజయ్‌తో సహా బిజెపి నేతలు ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవలసివస్తుందని సిపి సజ్జనార్ హెచ్చరించారు.