కేసీఆర్‌ వల్లే రాష్ట్రంలో బిజెపి బలపడింది: రేవంత్‌

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి నిన్న గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో బిజెపి ఇంత బలపడటానికి కారణం సిఎం కేసీఆరే. రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ఎదురే ఉండకూడదని, తన కొడుకుకు కాంగ్రెస్‌ వలన ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొకూడడనే దురాలోచనతో మా పార్టీ తరపున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను, ఇంకా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను టిఆర్ఎస్‌లోకి ఫిరాయింపజేసుకొన్నారు. పైగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులను గెల్పిస్తే వాళ్ళు ఎన్నికల తరువాత టిఆర్ఎస్‌లో చేరిపోవడం ఖాయం అంటూ తన సొంతమీడియా ద్వారా ప్రచారం చేయించి ప్రజలలో మా పార్టీపై అపనమ్మకం కలిగేలా చేశారు.

ఆయన తన కొడుకు కేటీఆర్‌ భవిష్యత్‌ కోసం చేసిన ఈ అనైతిక రాజకీయాలతో మా పార్టీ నష్టపోయిన మాట వాస్తవం. కానీ తద్వారా రాష్ట్రంలో బిజెపి బలపడింది. కనుక బిజెపికి ఈ అవకాశం కల్పించింది ఖచ్చితంగా సిఎం కేసీఆరే. పామును పెంచి పోషిస్తే అది పెంచినవాడినే కాటేస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచడంతో బిజెపిని పెంచిపోషించినట్లయింది. అదే ఇప్పుడు సిఎం కేసీఆర్‌కు ఆయన పార్టీకి, ప్రభుత్వానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో సవాలు విసురుతోంది. రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు అవకాశం కల్పించినందుకు సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ మూల్యం చెల్లించకతప్పదు,” అని అన్నారు.