అందుకు సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: అమిత్ షా

కేంద్రహోంమంత్రి అమిత్ షా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆదివారం హైదరాబాద్‌ వచ్చారు. ఛార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్ళి పూజలు చేసిన తరువాత అక్కడి నుంచి వారాసిగూడకు చేరుకొని సీతాఫల్‌మండీ వరకు రోడ్ షోలో పాల్గొవాలనుకొన్నారు. కానీ వేలాదిమందిగా బిజెపి కార్యకర్తలు తరలిరావడంతో వాహనం ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో కొంతదూరం ముందుకు సాగిన తరువాత అమిత్ షా అర్ధాంతరంగా రోడ్ షో ముగించుకొని పార్టీ కార్యాలయానికి చేరుకొని ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. 

అమిత్ షా పర్యటన సందర్భంగా ఛార్మినార్ నుంచి సీతాఫల్‌మండీ వరకు బిజెపి కార్యకర్తలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కాషాయరంగు తలపాగాలు ధరించి, బాజాభజంత్రీలతో ఆయనకు దారిపొడవునా స్వాగతం పలికారు. దాంతో ఆ పరిసరప్రాంతాలన్నీ మారుమ్రోగిపోయాయి. కార్యకర్తలు చేసిన ఈ హడావుడితో అమిత్ షాకు రోడ్ షోలో ఎక్కడ మాట్లాడే అవకాశమే లభించలేదు. 

పార్టీ కార్యాలయంలో అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ, “ఇంతకు ముందు చాలాసార్లు హైదరాబాద్‌ వచ్చాను. కానీ ఈసారి హైదరాబాద్‌ ప్రజలు, మాపార్టీ నేతలు, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఈ ఎన్నికలలో మేమే ఘనవిజయం సాధించబోతున్నట్లు అర్ధమైంది. నగరాన్ని వరదలు ముంచెత్తినా ప్రగతి భవన్‌ వదిలి బయటకు రాకుండా , ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను దూరం చేసుకొన్న సిఎం కేసీఆర్‌, మాకు ఈ గొప్ప అవకాశం కల్పించారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. 

హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సుమారు రూ.500 కోట్లు ఇచ్చింది. కానీ సిఎం కేసీఆర్‌ ఏనాడూ సచివాలయానికి వెళ్లలేదు కనుక ఆయనకు ఆవిషయం తెలిసి ఉండకపోవచ్చు. అందుకే కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని ప్రచారం చేసుకొంటున్నారు. కనుక ఇప్పటికైనా ఆయన ఫాంహౌజ్ నుంచి బయటకు వస్తే బాగుంటుంది. 

సిఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీలనే ఇంతవరకు అమలుచేయలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త హామీలిస్తున్నారు. మమ్మల్ని ప్రశ్నించేముందు పాత హామీలను ఎప్పుడు అమలుచేస్తారో సిఎం కేసీఆర్‌ ప్రజలకు జవాబు చెప్పాలి. హైదరాబాద్‌ నగరాన్ని చాలా అభివృద్ధి చేశామని సిఎం కేసీఆర్‌ చెప్పుకొంటున్నారు. కానీ ఇటీవల వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్‌ పరిస్థితి ఏవిధంగా మారిందో అందరూ చూశారు. ప్రగతి భవన్‌ చుట్టూపక్కల ప్రాంతాలు కూడా వరదనీటిలో చిక్కుకొన్నాయి. 

ఈ ఎన్నికలలో బిజెపికి ఓట్లేసి గెలిపిస్తే నగరాన్ని నిజమైన ఐ‌టి-హబ్‌గా అభివృద్ధి చేస్తాం. కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న విధానాల వలననే హైదరాబాద్‌కు పరిశ్రమలు వస్తున్నాయని ఈ సందర్భంగా నేను చెప్పదలచుకొన్నాను. కేసీఆర్‌, ఓవైసీల కుటుంబపాలన నుంచి నగరానికి విముక్తి కల్పించి  హైదరాబాద్‌ నగరాన్ని ఆధునిక నగరంగా అభివృద్ధి చేస్తాం. 

రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం చాలా సహజం. కానీ మజ్లీస్‌ పార్టీతో టిఆర్ఎస్‌ రహస్యంగా స్నేహం చేయడమెందుకు?ధైర్యంగా బహిరంగంగానే పొత్తులు పెట్టుకోవచ్చు కదా? పాతబస్తీలో ఉన్న రోహ్యింగాలుంటే నేనేమీ చేస్తున్నానని అడుగుతున్నారు కదా? ఒక్కసారి మీవద్ద ఉన్న ఆ జాబితాను నాకు పంపించండి. నేనేమి చేస్తానో మీరే చూద్దురుగాని. 

మేము చిల్లర రాజకీయాలు చేయడానికి ఇక్కడకు రాలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో గెలిచి మేయర్ పదవిని దక్కించుకోవడానికే వచ్చాము. ఈ ఎన్నికలలో తప్పకుండా గెలవడమే కాదు వచ్చే శాసనసభ ఎన్నికలలో కూడా తప్పకుండా గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము,” అని అన్నారు.