గుజరాతీలు, మార్వాడీలతో మంత్రి కేటీఆర్‌ సమావేశం

మంత్రి కేటీఆర్‌ నిన్న అమీర్‌పేటలో నగరంలోని గుజరాతీ, మార్వాడీ, అగర్వాల్, మహేశ్వరి వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మోడీ ప్రభుత్వం రూ.20 లక్షల కరోనా రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించింది. కానీ అది ఎవరికీ ఉపయోగపడిన దాఖలాలు లేవు. పైగా బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, ఎయిర్ ఇండియా, ఎన్టీపీసీ... ఇలా ఒకటొకటిగా అమ్మేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా బిజెపికి ఓట్లు వేసినవారు మాత్రమే దేశభక్తులన్నట్లు, ఇతర పార్టీలకు వేస్తే దేశద్రోహులన్నట్లు ప్రచారం చేస్తుంటారు. అభివృద్ధి, ప్రజాసంక్షేమం అజెండాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఎదుర్కోవాలని మేము సవాల్ చేస్తే, మోడీ ప్రభుత్వం గురించి చెప్పుకొనేందుకు ఏమీలేకపోవడంతో బిజెపి నేతలు మతరాజకీయాలు చేస్తున్నారు. బిజెపి, మజ్లీస్‌ పార్టీలను గెలిపిస్తే  నగరం అభివృద్ధి కోసం ఏమి చేస్తారో చెప్పకుండా సమాధులు కూల్చివేస్తామని ఒకరు, పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్ చేస్తామని, దారుస్సలాం కూల్చివేస్తామంటూ మరొకరు సవాళ్ళు...ప్రతిసవాళ్లు విసురుకొంటున్నారు. మనకు కావలసింది ఈ పనికిమాలిన ఉద్రేకపూరితమైన మాటలా లేదా అభివృద్ధి, ప్రశాంతమైన వాతావరణమా? గత ఆరున్నరేళ్ళలో మా ప్రభుత్వం రాష్ట్రాన్ని నగరాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తోందో మీరందరూ చూశారు. కనుక ఈ అభివృద్ధి, ప్రశాంత వాతావరణం ఇలాగే కొనసాగాలంటే మీరందరూ కూడా మాకే‌ ఓట్లువేసి గెలిపించాలి,” అని కేటీఆర్‌ అన్నారు.