నేటితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ముగింపు

ఈనెల 17న జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. అంటే నేటికీ కేవలం 12 రోజులు మాత్రమే అయ్యింది. కానీ ఈ 12 రోజులలోనే టిఆర్ఎస్‌-బిజెపి-మజ్లీస్‌ పార్టీల మద్య ఊహించని స్థాయిలో భీకర రాజకీయ యుద్ధాలు జరుగడంతో హైదరాబాద్‌ నగరంలో తీవ్ర ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. అయితే ఈరోజు సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తుంది కనుక మళ్ళీ నగరంలో ప్రశాంత వాతావరణం ఏర్పడవచ్చు. 

నేటి సాయంత్రం 6 గంటల తరువాత ఎవరూ రోడ్ షోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ఒకవేళ ఎవరైనా ఏ రూపంలో ఎన్నికల ప్రచారం నిర్వహించినా వారికి జరిమానా లేదా రెండేళ్ళు జైలు శిక్ష లేదా రెండూ విధిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ ప్రకటించారు. అలాగే టీవీ ఛానల్స్, సినిమా థియేటర్లలో కూడా ఎన్నికల ప్రచారానికి సంబందించి ఎటువంటి ప్రకటనలు, విజ్ఞప్తులు చేయరాదని చెప్పారు. నేటి నుంచి నగరంలో అన్ని మద్యం షాపులు మూసివేయాలని, మద్యం అమ్మకాలు, కొనుగోలు, సేవనంపై నిషేదం విధిస్తున్నట్లు అశోక్ కుమార్ తెలిపారు. 

ఇతర ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన రాజకీయనాయకులు, కార్యకర్తలు సాయంత్రం 6 గంటల తరువాత జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండరాదని అన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్నవారిపై ఎటువంటి ఆంక్షలు ఉండబోవని చెప్పారు. పోలింగ్ రోజున ఒక్కో అభ్యర్ధికి ఒక్క వాహనాన్ని, ఒక పోలింగ్ ఏజంట్‌ను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. 

డిసెంబర్‌ 1వ తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటలవరకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్‌ 4న ఓట్లు లెక్కించి వెంటవెంటనే ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు.